తెలంగాణ సర్కార్ కు హై కోర్టు శుభవార్త, TS High court green signal
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు హై కోర్టు శుభవార్త చెప్పింది. సచివాలయ భవనాల కూల్చివేతకు TS High court green signal ఇచ్చింది. పాత భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్.
సచివాలయం పాత భవనాల కూల్చివేతలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది . చట్ట విరుద్ధంగా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు , తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది .
TS High court green signal ::
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్ , జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాజ్యంపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే . భవనాల కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు . కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని , నిబంధనల ప్రకారం హైదరాబాద్ నగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ ) అనుమతి పొందినట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు . కేవలం భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని సంబంధిత శాఖ నుంచి అనుమతి ఉంటే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు .
నూతన నిర్మాణాలు చేప ట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు . నూతన నిర్మాణాలు చేపట్టేముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ చెప్పారు . ల్యాండ్ ప్రిపరేషన్లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు . కరోనా పరిస్థితుల్లో కూల్చివేతల వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగనీయడం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు . కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరం లేదని సొలిసిటర్ జనరల్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది .
పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కోర్టు తెలిపింది . ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకునికూల్చివేత పనులు చేపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది . ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని పేర్కొంది . పిటీషనర్ వాదనలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది . కోవిడ్ -19 ను దృష్టిలో పెట్టుకుని కూల్చివేత పనులు జరుపుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది