కోర్టు తీర్పు పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు, Asaduddin comments on court verdict

 Asaduddin comments on court verdict బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరారోపణలను ఎదుర్కొన్న వారందరినీ నిర్దోషులుగా గుర్తిస్తూ లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అఖిల భారత మజ్లిస్ – ఇ – ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత , హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు .

 దేశ న్యాయవ్యవస్థలో బాధాకరమైన రోజుగా అభివర్ణించారు . మసీదులను కూలగొట్టి దానిపై ఆలయాలను నిర్మించదలచిన వారిని న్యాయస్థానం నిర్దోషులుగా గుర్తించడం మచ్చగా పేర్కొన్నారు . ఎవరూ కూల్చకపోతే ఎలా కూలింది ? సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పే చివరిదేమీ కాదని , హైకోర్టు , సుప్రీంకోర్టు ఉన్నాయని చెప్పారు . సుప్రీం కోర్టు తీర్పే ఫైనల్ అవుతుందని చెప్పారు . న్యాయవ్యవస్థపై తనకు ఇప్పటికీ విశ్వాసం ఉందని ఆయన వ్యాఖ్యానించారు . బుధవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు . బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటనను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు . ఎవరూ కూల్చకపోతే .. మసీదు కూలింది ? దానికదే కూలిపోయిందా ? అని ప్రశ్నించారు . మసీదులను కూల్చిన వారికి క్లీన్ చిట్ ఎలా ? మసీదులను కూల్చివేసిన వారిని క్లీన్ చిట్ ఎలా లభిస్తుందని అన్నారు .

Asaduddin comments on court verdict ::

 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో న్యాయస్థానం నుంచి క్లీన్ చిట్ పొందిన నేతల్లో చాలామంది కేంద్రమంత్రులుగా , గవర్నర్లుగా పనిచేశారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు . మసీదును కూల్చేయడం వల్ల వారికి బహుమానంగా ఆ పదవులు లభించాయని ఆరోపించారు . మసీదుకు వేసిన తాళాన్ని తెరిచి మరీ .. అందులో విగ్రహాలను ఉంచిన విషయాన్ని ఎవరూ మర్చిపోరని ఒవైన్ అన్నారు . దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు . వారందరూ ఉన్నత పదవులను పొందారు .. బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరారోపణలను ఎదుర్కొని , తాజాగా క్లీన్ చిట్ పొందిన ఎల్‌కే అద్వానీ , మురళీ మనోహర్ జోషి ఉమాభారతి , కల్యాణి సింగ్ వంటి నేతలందరూ ఉన్నత పదవులను అనుభవించిన వారేనని అన్నారు .

 సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ప్రతి ముస్లిం ఆవేదన పడుతుంటారని చెప్పారు . ఉమా భారతి ఏక్ ధక్కా ఔర్ దో .. బాబ్రీ మసీద్ తోడ్ దో .. అనే నినాదాన్ని ఇచ్చారని , దీన్ని దేశ ప్రజలందరూ చూశారని అన్నారు . బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఆయా నేతలందరూ స్వీట్లను పంచుకున్న దృశ్యాలు ఇప్పటికీ విస్మరించలేనివని చెప్పారు . ఎన్నో సాక్ష్యాధారాలు .. ఇన్ని సాక్ష్యాధారాలు ఉండగా .. సీబీఐ న్యాయస్థానం ఈ తీర్పును ఎలా ఇవ్వగలుగుతుందని ఒవైనీ అన్నారు . ఈ వివాదంలో 1950 నుంచి ముస్లింలకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు . క్లీన్ చిట్ పొందిన నేతలందరూ సంఘటనా స్థలం వద్ద కరసేవకులను రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు ఇచ్చారని , ఇది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు . హిందుత్వవాదులను సంతృప్తి పర్చడానికి ఈ తీర్పు వచ్చిందని తాను భావిస్తున్నట్లు ఒవైసీ చెప్పారు .

Related Articles

Back to top button